Sunday, October 28, 2012

ప్రజా ఉద్యమాలలో డబ్బు ప్రభావం (1-12-2011)

మానవ శ్రమ డబ్బుగా మారిన ప్రక్రియకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది. రూపాయలు లేదా కరెన్సీ నోట్లు కేవలం కాగితాలు మాత్రమే అవుతే, ఇవి ప్రత్యేకంగా ముద్రించిన కాగితాలు. ఈ ‘డబ్బు’ను లక్షలు లక్షలుగా జేబులో పెట్టుకొని ఒక పర్వత శ్రేణి మీదో, ఒక అడవిలోనో, లేదా మనుషులు, ఉత్పత్తులు లేని ప్రాంతంలో ఉంటే అవి కేవలం కాగితాలు మాత్రమే. డబ్బుకున్న ‘విలువ’ దా నితో కొన్న వస్తువుల శ్రమలో ఉంటుంది. మనుషులు వస్తువులను వస్తువులతో మార్పిడి చేసుకున్నంత వరకు మనుషుల అవసరాల మేరకు ఆ మార్పిడి జరుగుతూ ఉండేది. ఒక వస్తువులోని శ్రమ, ఇంకో వస్తువులోని శ్రమతో మార్పిడి ఉండేది. ఈ ప్రక్రియ మనుషుల మధ్య ఉన్నంత కాలం శ్రమ విలువ స్పష్టంగానో, అస్పష్టంగానో తెలిసేది. ఈ మార్పిడికి ఒక మారకం విలువ ఆపాదించి బంగారాన్ని ‘ప్రమాణం’గా ఉపయోగించారు. నిజానికి బంగారమంత పనికిరాని ఖనిజం మరేది లేదు. ఇది ఇనుములా ఉత్పత్తిలో సాధనం కాదు. ఐనా సామాజిక పరిణామంలో ఈ మార్పు వచ్చింది. బంగారం ఆధారితంగా తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరిగే క్రమంలో ముందు నాణాలతో, ఆ తర్వాత కరెన్సీ నోట్ల రూపంలో శ్రమవిలువను నిర్ధారించడం జరిగింది. ఈ మార్పును మరచిపోయి లేదా దాన్ని మరుగున వేయడం వలన ప్రపంచమంతా కరెన్సీతో నడుస్తున్నదని కాళోజీ ‘గొర్రె మాదిరి’గా మనుషులు ఆలోచిస్తున్నారు. డబ్బు అన్ని వస్తువుల శ్రమకు ప్రమాణమై వస్తువుల మార్పిడి ప్రత్యక్షంగా కాక పరోక్షంగా డబ్బుల ద్వారా జరగడంతో సామాజిక సంబంధాలలో ఒక కీలకమైన మార్పు రావడంతో మనిషికి మనిషితో పనిలేదు. ‘అన్నీ డబ్బు ద్వారానే చేసుకోవచ్చు’ అని బలపడడంతో మానవ సంబంధాలన్నీ యాంత్రికంగా మారిపోయాయి. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ’ చేసిన దుర్మార్గాలలోఇది చాలా పెద్ద దుర్మార్గం. అయితే వస్తువులోని ‘శ్రమ’ను కొలవడం అంత సులభంగా మనిషి సేవలను కొలవడం కష్టం.ఒక ఉపాధ్యాయుడు చెప్పే చదువును,ఒక డాక్టర్ రోగిని చూసే సేవను డబ్బులతో విలువ కట్టడం తల్లి ప్రేమను కొలవడమంత కష్టం. నిజానికి ఇది అసాధ్యమైన పని. అవుతే సేవలు అందించే వారికి తాము గౌరవ ప్రదంగా జీవించే జీవన ప్రమాణం మీద వాళ్ల శ్రమను అంచనా వేయడం జరుగుతూంటుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా మూడు శాతం. ఉత్పత్తి వాటా 25 శాతం నుంచి 30 శాతం, మిగతా వ్యవస్థ అంతా సేవా రంగమే. వస్తువులను ఎగుమతి చేయలేక ఆర్థిక సంక్షోభంలో పడిన అమెరికా తన సంక్షోభం నుంచి బయట పడడానికి ప్రపంచ వ్యాప్తంగా సేవలను కూడా వస్తువులుగా పరిగణించాలని ప్రచారం చేసి సేవలను కూడా అమ్మడం, కొనడం, లాభం నష్టం చట్రంలోకి బలవంతంగా లాగింది. దీనితో మనదేశంలో ఒక కాలంలో అతి గౌరవంగా చూడబడే డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ వ్యాపారుల లాగా ప్రవర్తించే ఒక మార్కెట్ సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు. ఈ మారుతున్న సంస్కృతిలో రాజకీయ నాయకులు, రాజకీయాలు ఏ విధంగా మారాయో మన ఆరు దశాబ్దాల స్వాతంత్య్రం అనుభవంలో చూడవచ్చు. స్వాతంవూత్యోద్యమంలో తమ తమ వృత్తులు వదులుకొని, తమ వ్యాపకాలు వదులుకొని, ఆస్తులు వదులుకొని కుటుంబాలను కాదని దశాబ్దాల తరబడి జైళ్లలో జీవితాలు గడిపిన వాళ్ల సేవలను లాభ నష్టాల బేరీజులో ఎలా చూడగలం? భగత్‌సింగ్ త్యాగం విలువ ఎంత? కొందరు మనుషులు అందరు మనుషుల సుఖం కోసం సర్వస్వం త్యాగం చేసే సమున్నతమైన మానవవిలువలు వాటి ఆచరణ చరిత్ర గతిలోనే వచ్చాయి. అలాగే రోజంతా శారీరక శ్రమచేసి, పూట గడిస్తే చాలు అని సమాధానపడే అమాయకత్వాన్ని ఏ కోణం నుంచి చూడాలి అనే ప్రశ్నలు కూడా వస్తాయి. అవుతే ప్రజాసేవ చేస్తాం, మేం సమష్టి ప్రయోజనం కోసం పని చేస్తాం అని భావించే వారు రాజకీయాలలోకి వస్తారని, రావాలని సామాజిక ఆకాంక్ష. సేవ చేస్తామని వస్తున్న వారు, వచ్చి తమ సేవను అమ్మడం, కొనడం ప్రక్రియలోకి దిగజార్చారు. దాంతో ప్రజలు ఇచ్చిన అధికారంతో వ్యక్తిగత సౌకర్యాలు, ప్రయోజనాలే కాక లాభాల వేటలో పడ్డారు. దీంతో విపరీతంగా వ్యాపారాలతో లాభాలు చేసుకున్న సంపన్నులకు వీళ్లు ‘సేవకులు’గా మారారు. ఎన్నికలలో ప్రజల సేవ గురించి మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక సంపన్నుల సేవ వీళ్ల నైజంగా మారింది. ఇలా మారడం ప్రజలు గమనిస్తున్నా ప్రజలు ఎక్కడ తిరుగబడతారో అని, వాళ్ల ఓట్లను కొనడం ప్రారంభించారు. ఓటును కొనడం, అమ్మడం తప్పు అని ఎవరు ఏమన్నా రోజు జీవితం గడవడం, కష్టంగా ఉన్న వాళ్ల బలహీనతను ఐదేళ్లకొకసారి తమ ఓటు అమ్ముకోవచ్చు అన్న సంస్కృతిని రాజకీయ నాయకులు పెంచి పోషించారు. ప్రజల అవగాహన చైతన్యం పెరిగిన కొద్దీ డబ్బు పాత్ర అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నది. ప్రధాన స్రవంతి రాజకీయాలు ఇలా దిగజారడంతో ప్రజలను పట్టించుకునే వాళ్లు, వాళ్ల సమస్యలకు స్పందించే ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు ఘనీభవించి సమష్టి ఉద్యమాలకు దారి తీస్తాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం భిన్న ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల మీద నిరంతరంగా ఒత్తిడి పెడుతుంటారు. దానికి కూడా స్పందించకపోతే ఇక ఈ వ్యవస్థ పనిచేయదు అని మొత్తం వ్యవస్థను పునాదులతో సహా మార్చివేయవలసిందే అన్న ఒక కీలక అవగాహనకు వచ్చిన వాళ్లు కీలక చైతన్య స్థాయికి ( critical consciousness ) చేరుకుంటారు. ఈ చైతన్యానికి చేరుకున్న వారిని, అలాంటి ఉద్యమాలను అమ్మడం, కొనడం అనే వ్యాపారంలోకి దించడం సాధ్యం కాదు. కాని అర్థ చైతన్య దశలో ఉన్న ఉద్యమాలు డబ్బుకు లోబడవచ్చు. డబ్బు అలాంటి ఉద్యమాలను కొనడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని ప్రతిది కొనవలసి రావడంతో ఉద్యమాలు నడపడం కూడా డబ్బుతో కూడుకున్న ప్రక్రియగా మారుతున్నది. ఒక గ్రామంలో సభ పెట్టాలంటే 50,60,70 దశాబ్దాలలో జనాన్ని ఎక్కడికక్కడ సమీకరించి, కొందరు వ్యక్తులను పిలిచి సభ జరపడం ఒక పద్దతిగా ఉండేది. ఆ కాలంలో మాలాంటి వాళ్లం బస్సులో ప్రయాణ ఖర్చులు మేమే భరించి వెళ్లే వాళ్లం. మేమే సభ పెడితే ఉపాధ్యాయుల దగ్గర, ప్రభుత్వోద్యోగుల దగ్గర, మిత్రుల దగ్గర ఒక్క రూపాయ నుంచి ఐదు, పది రూపాయలను సేకరించే వాళ్లం. సంపన్నుల దగ్గరికి వెళ్లే వాళ్లం కాదు. వెళ్లాలని అప్పుడు తోచేది కూడా కాదు. ఒకసారి వరంగల్‌కు ఢిల్లీ నుంచి వక్తను పిలిస్తే ఆయన విమాన టికెట్ ఖర్చు బాలగోపాల్ ఆనెల జీతం మొత్తం ఇచ్చారు. ఈ సంస్కృతి అన్ని మారినట్లుగానే మారుతూ వచ్చింది. ఇప్పుడు గ్రామంలో సభ అంటే షామియానా, మైకు, ప్రజలను తీసుకురావడానికి వాహనాలు, వక్తలను కార్లల్లో తీసుకురావడం.. వీటితో ఒక గ్రామంలో మీటింగ్ పెట్టాలన్నా ఐదునుంచి పదివేలు కనీసం ఖర్చు. పెద్ద పెద్ద మీటింగ్‌లు లక్షలతో కూడిన పని అయ్యింది. మధ్యతరగతిలో దాతృత్వ గుణం కూడా తగ్గింది.దీంతో సులభంగా డబ్బులు సమీకరించ గలిగింది డబ్బులున్న వాళ్ల దగ్గరినుంచే. రాజకీయ నాయకులు తమ పలుకుబడితో విపరీతంగా డబ్బులు సేకరించి ఏ మీటింగ్ పెట్టుకొనడానికైనా,సులభంగా సునాయసంగా డబ్బులు ఇస్తున్నారు. సభలు జరిపే వారికి సభ జరపాలన్న కోరికే గాని సభకు డబ్బులు ఎవ్వరిస్తున్నారు అన్నది ప్రధానం కాకుండా పోతున్నది. దీంతో ఉద్యమం లో, సభలు, సమీకరణలు రాజకీయ విశ్వాసాలతో జరిగినా డబ్బు పాత్ర మనకు తెలియకుండానే చాలా కీలకమైపోయింది. సునాయసంగా వచ్చే డబ్బులు ఆగిపోతే సభలే ఆగిపోయే ప్రమాదపు అంచుకు మనం చేరుకున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయ రిసర్చ్ స్కాలర్స్ నిర్వహించిన ఒక సదస్సులో నేను ఈ ఆందోళనను వాళ్లతో పంచుకున్నప్పుడు కొందరు వక్తలు ‘సంపన్నుల నుంచి డబ్బులు తీసుకుంటే ఏం తప్పు’ అనే ప్రశ్న లేవదీశారు. తప్పా కాదా అన్న ప్రశ్న కంటే అలాంటి డబ్బు మీదే ఆధారపడి సదస్సులు జరిపితే డబ్బు ప్రవాహం ఆగిపోతే, ప్రాణవాయువు ఆగిపోయినంత పని ఐతే ప్రజాస్వామ్య ఉద్యమాల నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది అనే ఒక కీలక ప్రశ్న తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకు వచ్చింది. అవుతే ఈ ప్రశ్న ఇప్పుడు అడగడానికి సరియైన సందర్బం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ చైతన్య స్థాయి చాలా ఎత్తుగా ఎదిగింది. కొందరు యువకులు ఆత్మహత్యలే చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం సరియైన మార్గం కాదని అందరం అంటున్నాం, కాని అలా చనిపోయిన వారికి స్వప్రయోజనం లేదన్నది ఒక సున్నితమైన సత్యం.వాళ్ల ప్రాణాలను లాభనష్టాల చట్ర పరిధి దాటి విస్తృత మానవ విలువల ప్రాంగణంలో ఆవిష్కరించబడ్డాయి.నాకు తెలిసిన వందల మంది చాలా నిజాయితీగా ఉద్యమంలో పాల్గొంటున్నారు.వాళ్ల నిజాయితీకి ఎక్కడో ప్రజల చైతన్యంలో వేళ్లున్నాయి. ప్రజా చైతన్యం నిజాయితీగల ఒక వర్గం ఈ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని డబ్బు ప్రభావం నుంచి కాపాడగలమా లేదా అన్నది ప్రశ్న. డబ్బు ప్రభావం నుంచి ప్రజా ఉద్యమాలని కాపాడ లేకపోతే కోట్లాది రూపాయల (భిన్న పద్దతుల ద్వారా)ఆధిపత్యం కలిగిన ఆంధ్ర పెట్టుబడి దారులు, తెలంగాణ రాజకీయ నాయకులు ఉద్యమాన్ని నియంవూతించవచ్చు.అది వాళ్లు చేయగలిగితే అది మరొక పెద్ద ప్రమాదం.ఒకవిధంగా రాజకీయ నాయకులు ప్రజా ఉద్యమాన్ని లక్షల మంది ప్రజల ఆకాంక్షలను పట్టించుకోక పోవడానికి కూడా ఒక కారణమే. ఎప్పుడైనా ఉద్యమాలను నిర్వీర్యం చేయవచ్చని, ఎప్పుడైనా చైతన్యాన్ని కొనవచ్చని వాళ్లు భావిస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో లక్షలాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష డబ్బు బలంతో ఢీ కొంటున్నది. ఈ సంఘర్షణలో డబ్బుమీద ప్రజా చైతన్యం గెలవడమే తెలంగాణ ఉద్యమం చరిత్ర గమనానికి అందించగల్ల ఒక గొప్ప కానుక.

No comments:

Post a Comment