(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
విజయమ్మ దండయాత్ర (26-7-2012)
విజయమ్మ సిరిసిల్ల ‘సాహస’ యాత్రకు స్పందించడం కొంత వ్యక్తిగత ఇబ్బందితో కూడుకున్న అంశమైనా,ఈ యాత్రకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగవలసిన అవసరముంది. రాయలసీమ ముఠా రాజకీయాల గురించి కాని, లేక రాజశేఖర్‌డ్డి కుటుంబపరంగా వస్తున్న ఫ్యాక్షనిజం గురించి కాని, దానితో ముడిపడి ఉన్న హింస, మనుషులు ఒకరికొకరు నిర్దాక్షిణ్యంగా చంపుకోవడంపై కథలు కథలుగా చెప్పుకునే కథనాన్ని ఇక్కడ చర్చించడం లేదు. ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం ఈ ఫ్యాక్షనిజాన్ని గురించి లోతుగానే పరిశీలించి ప్రచారం చేసింది. ప్రచారం చేసేప్పుడు బాలగోపాల్ చాలా పబ్లిక్ మీటింగ్‌లలో రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిజాన్ని, ఫ్యాక్షనిస్టులను అసహ్యించుకోవాలని పదేపదే చెప్పేవాడు. అసహ్యించుకోకపోతే దాని సాధికారత కొనసాగుతుందని, ప్రజలు ఆ విష వలయం నుంచి తప్పుకోలేరని చెప్పేవాడు.
ఈ మొత్తం హింసలో మహిళల ప్రత్యక్ష పాత్ర చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో మహాభారతంలో ద్రౌపది చేసిన ప్రతిజ్ఞలా మహిళలు చేశారని వినికిడి ఉంది. అయితే ఈ విషయాలు విజయమ్మకు పూర్తిగా తెలుసో లేదో తెలియదు. మొత్తంగా విజయమ్మ రాజశేఖర్‌డ్డి సతీమణిగా, జగన్మోహన్‌డ్డి తల్లిగా ఒక అనివార్య పరిస్థితిలో రాజకీయ జీవనంలోకి నెట్టబడింది. నిజానికి ఆమె కూతురు షర్మిలా బాగానే మాట్లాడుతుంది. ఆమెకు అవకాశమిస్తే నాయకురాలిగా ఎదిగే అవకాశముంది. కానీ ప్రియాంకగాంధీని ఎలా క్రియాశీల రాజకీయాల్లోకి రానివ్వడం లేదో ఈమె పట్ల కూడా అదే వైఖరి ఉంది. విజయమ్మ చెప్పిన మాటలు ఆమె తనయుడు వింటా డో లేదో కాని ఆయన సలహాల మేరకు ఆమె రాజకీయ పాత్రను నిర్వహిస్తున్నా రు. తల్లికి పిల్లల మీద సహజంగానే ప్రేమ ఉంటుంది. బైబిల్ ప్రకారం దారి తప్పిన వాడిమీద శ్రద్ధ ఎక్కువుంటుంది. కాని పరకాలలో కాని, సిరిసిల్లలో కాని పర్యటించేప్పుడు సమస్యలేమిటో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఆ సమస్యల పట్ల రాజశేఖర్‌డ్డి వైఖరి ఏముండేదో సరిగ్గా తెలియకపోతే సిరిసిల్లలో ఎందుకు అంత ప్రతిఘటన వచ్చిందో ఆమెకు పూర్తిగా అవగాహన కాకపోచ్చు.
ప్రభుత్వం తన ప్రయోజనం కోసమని, సమైక్యవాదాన్ని ఈ పద్ధతిలో తెలంగాణలో ప్రవేశపెట్టి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే లేదు అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నది. పరకాలలో, సిరిసిల్లలో స్థానిక నాయకత్వాలకు ఇతర ప్రయోజనాలున్నా యి. ఈ రెండు పర్యటనలు తెలంగాణ గురించి వై.ఎస్.ఆర్. పార్టీ వైఖరి స్పష్టమై న ప్రకటన ఇప్పించలేకపోయాయి. ఈ మొత్తం రాజకీయ ప్రక్రియలో కొందరు తెలంగాణ నాయకులు ప్రజల ఆకాంక్షల ను కాదని ఇతర ప్రాంత నాయకత్వం మీద ఎంత ఆధారపడి ఉన్నారో మరొకసారి రుజువు అయ్యింది. తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షను సమీకరించడంలో తెలంగాణ ఉద్యమం ఎంత సఫలమయ్యిందో, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ప్రభావితం చేయడంలో అంత విఫలమయ్యింది. ఉద్యమ ప్రజాస్వామ్య సంస్కృతికి ‘ప్రాతినిధ్యపు ప్రజాస్వామ్యా’నికి ఎంత అంతరమున్నదో మరోసారి స్పష్టమయ్యింది.
విజయమ్మ సిరిసిల్ల చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి , వాళ్ల బాధలను అర్థం చేసుకోవడానికని వెళ్లామని అంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య సానుభూతితో పరిష్కారమయ్యే సమస్య కాదు. అది ఒక సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనా అల్లిన విష వలయం. ఇది ఒక చేనేత కార్మికుల మీదే కాదు, దాదాపు అన్ని చేతి వృత్తులు అలా విధ్వంసం అయ్యాయి. సామ్రాజ్యవాద విషవలయం నుంచి చేనేత కార్మికులను కాపాడడానికి సానుభూతి సరిపోదు. అభివృద్ధి నమూనా మూలాలను ప్రశ్నించాలి. అలా ప్రశ్నించాలంటే బలమైన ప్రజా ఉద్యమం కావాలి. తెలంగాణ ఉద్యమానికి సామ్రాజ్యవాదం మీద స్పష్టమైన వైఖరి ఉన్నా లేకున్నా ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్న ప్రజల ఆకాంక్షల వెనక అభివృద్ధి నమూనా మీద ఆగ్రహం ఉన్నదనేది చాలా స్పష్టం.
దానికి విజయమ్మ ఏం చేయగలరో తెలియదు.ఒక రాజకీయ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సిరిసిల్లకు వెళ్లి మాట్లాడే హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాలా వద్దా అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పవలసి ఉంది. సమాధానం కాకున్నా కనీసం చర్చించవలసిన అవసరం ఉంది. ఈ ప్రశ్న పరకాల ప్రభాకర్ పదే పదే అడుగుతున్నాడు. సమైక్యవాదాన్ని గురించి హైదరాబాద్‌లో మాట్లాడే హక్కు లేదా, పౌరహక్కుల ఉద్యమం ఈ మాట్లాడే స్వేచ్ఛను కాపాడాలి కదా అని నాతో వాదించాడు. నిజమే మాట్లాడే స్వేచ్ఛ అందరికి ఉండాలి. తెలంగాణవాదులకు ఆంధ్ర ప్రాంతంలో, సమైక్యవాదులకు తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటే బావుండేది.
కాని ప్రజాస్వామ్యం అంత పరిణితి చెందలేదు కదా. ఒక సందర్భంలో పాలమూరు కరువు మీద ఒకరోజు ధర్నా చేసి ఎన్నికలలో రాజకీయ నాయకులను పాలమూరు సమస్యలపై నిలదీయం డి అని ప్రజలకు చెప్పడానికి అనుమతి కోరితే ప్రభుత్వం దాన్ని తిరస్కరిస్తే బాలగోపాల్ హైకోర్టులో లంచ్‌మోషన్ మూవ్ చేసి కోర్టు నుంచి అనుమతి ఇప్పించాడు. తెలంగాణ ప్రజల నిరసనల మధ్య ఇంత పోలీసు రక్షణ కల్పించి విజయమ్మ మాట్లాడే హక్కును కాపాడిన ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి తమ సమస్యలను చెప్పుకోవడానికి హైదరాబాద్ వస్తే అర్ధరాత్రి వాళ్లను, వాళ్లతో పాటు పౌరహక్కుల నాయకులను అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు మాట్లాడే హక్కు ఉందా లేదా అన్న ప్రశ్నకు మన రాష్ట్ర పోలీసులు మాట్లాడే స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్లు జవాబు చెప్పాలి. వాళ్లు ఒకవేళ శాంతిభవూదతల సమస్య అని అంటే, విజయమ్మ యాత్ర శాంతియుతం గా, భద్రతగా జరిగిందా? ప్రభుత్వం పాటిం చే విలువలలో, ప్రమాణాలలో సార్వజనీనత, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమాత్రం లేకపోవడం వల్లే రాజ్యాంగం కల్పించిన మాట్లాడే హక్కు ఇప్పుడు పోలీసుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది.
ఇక పులి రాజకీయ సంస్కృతి గురించి మాట్లాడితే చిట్టా చాలా విప్పవలసి ఉంటుంది. కడప లోపలి ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడాలంటే కడప దాటే మాట్లాడాలి. కడప లోపల అంతా గప్‌చిప్. ముఠాలుగా విడిపోయిన గ్రామాల్లో ఒక రాజకీయ పార్టీ మరొక ముఠా గ్రామానికి వెళ్లడం నిషేధం. అది ఉల్లంఘిస్తే మరణదండన కన్నా తక్కువ శిక్ష ఉండదు. ఈ అంశం మీద బహుశా మానవ హక్కుల వేదిక జయ శ్రీ కంటే ఎక్కువ ఎవరికి తెలిసి ఉండదు. ఆమెకు రాయడం, పబ్లిక్ లెక్చర్స్ ఇవ్వడం అలవాటులేకపోవడం వల్ల ప్రజాస్వామ్యానికే చాలా నష్టం జరిగింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రజాస్వామిక హక్కు కోసం రాజీలేని సాహస పోరాటం జయశ్రీ చేస్తున్నది. జయశ్రీ విజయమ్మలా తిరిగితే రాజ్యం ఇంత రక్షణ కల్పిస్తుందా? ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ పులి రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే అర్హత లేదేమో అనిపిస్తుంది. విజయమ్మ జయశ్రీని కలిసి చర్చిస్తే కొంత ప్రయోజనకరంగా ఉండవచ్చు.
అయితే విజయమ్మ మహిళగా రాయలసీమ రాజకీయాలలో ఎదిగితే, బయటి అనుభవాన్ని నిశితంగా పరిశీలిస్తే, కడపలో ప్రజాస్వామ్య ఆచరణను గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే బహుశా ఆమెకు చాలా ఆశ్చర్యకరమైన, ఊహించని కొన్ని నిజాలు అర్థం కావచ్చు. దారితప్పిన తన కొడుకు భవిష్యత్తే కాకుండా లక్షలాది మంది పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే రాయలసీమకు, కడపకు, ముఖ్యంగా పులి కొంత మేలు జరగవచ్చు. ఇలాంటి యాత్రలు ఏవైనా ప్రజల అభిమానం మధ్యన జరగాలి. కానీ పోలీసుల తుపాకుల రక్షణతో కాదు.
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment