(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
పోలీసు కుటుంబాల పోరాటం (9-8-2012)
‘మా లోని వాడివే, మా వాడివే నీవు పొట్టకూటి కొరకు పోలీసు అయ్యావు’ అని గద్దర్ పాడుతున్నప్పుడు పోలీస్ కానిస్టేబు ల్స్ చాలా ఆసక్తిగా పాట వినడమే కాక, మళ్లొకసారి పాడమని ఇతరుల ద్వారా అడిగించుకునేవారు. ఆ పాట వాళ్లను కదిలించడానికి కారణం వాళ్ల జీవిత అనుభవంపభుత్వ శాఖలన్నింటిలో నిచ్చెన మెట్లు ఉండ డం, పై అధికారి కింది అధికారుల మీద ఆధిపత్యం చెలాయించడం ఒక సహజమైన అంశంగా పరిగణిస్తుంటారు. ప్రభుత్వానికి అలాగే భిన్నమైన శాఖలకు ఒక లక్ష్యముంటుందని, దాని కోసం సమష్టిగా కృషి చేయడానికి మనుషులు ఒక్కచోట కలిసి పనిచేస్తున్నారనే స్పృహ లేకపోవడం ప్రభుత్వ పాలనా సంస్కృతిలో చాలా పెద్దలోపం. అందరూ మనుషులే అని వాళ్ల వాళ్ల అర్హతలను, అవకాశాలను బట్టి భిన్న స్థాయిలలో పని చేస్తుంటారని అంత మాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరనే విషయాన్ని అధికారుల బుర్రలోకి ఎక్కించడం అంత సులభమైన పనేమి కాదు.
ఈ అమానవీయ సంస్కృతి అన్ని శాఖల కంటే పోలీస్ శాఖలో చాలా విస్తృతంగా ఉంది. బలవూపయోగమనేది ఒక అమానవీయ సంస్కృ తి. దాన్ని వ్యవస్థీకరించి, ఒక పద్ధతిగా ఆచరించడం వల్ల, శాఖలో అతి చిన్నస్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్‌ను నిరంతరంగా ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా వాడుకోవడం వల్ల పోలీసు యంత్రాంగం చాలా పెద్దఎత్తున అమానుషీకరణకు గురైంది. అయితే మనుషులు యాంత్రికంగా, అమానవీయంగా నిత్య జీవితంలో జీవించడం సాధ్యం కాదు. పోలీసు డ్యూటీలకు బయట వాళ్లకొక కుటుంబ జీవితముంటుం ది. వాళ్లకు స్నేహాలు, బంధువులు, పిల్లలుంటారు. ఈ సహజమైన మాన వ సంబంధాలకు పోలీసు శాఖలోని అసహజమైన సంబంధాలకు మధ్య ఒక నిరంతర ఘర్షణ ఉంటుంది. అయితే పై స్థాయిలో పనిచేసే అధికారులకు, అధికారం చెలాయించే వెసులుబాటే కాక, సౌకర్యాలు కూడా చాలా ఉంటాయి. వాళ్లలో కూడా చాలామంది అధికారులు అమానుషంగా మారినా కుటుంబాల వరకు కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటులో ఒక భాగం ఆర్డర్లీ వ్యవస్థ. ఈ వ్యవస్థ మూలాలను బాని స సమాజంలో చూడవచ్చు.
మోహన్‌రావు స్పార్టకస్ పేర రాసిన ఖాకీ బతుకులు అన్న ఆత్మకథ ఒక అద్భుతమైన సాహిత్య ప్రయోగం. ఇది ఒక కానిస్టేబుల్ ఆత్మకథే కాక ఆయన తండ్రి జీవిత చరిత్ర కూడా. ఈ రచనలో ఒక ఆర్డర్లీ జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించాడు. ఇందులో ఒక వ్యవసాయకూలీ జీవితాన్ని ఆర్డర్లీ జీవితంతో పోలుస్తూ, ఈ రెండు పనులలో ఎందులో ఎక్కు వ ఆత్మగౌరవం ఉంటుందో అన్న చర్చ ఉంది. వ్యవసాయ కూలీ ఒక ఉత్పత్తిలో పాల్గొనడమే కాక ఆ ఒక్క పనే చేయవలసి ఉంటుంది. వచ్చే కూలీ చాలా తక్కువే అయినా పనిలో గౌరవముంది. ఒక ఆర్డర్లీ పిల్లల టాయిపూట్ కడగడం నుంచి బట్టలు ఉతికే లాంటి అన్ని ఇంటి పనులు చేయాలి. చేస్తున్న క్రమంలో ఆఫీసర్ల భార్య లు తిట్టే తిట్లు, అవమానాలు భరించాలి.
వీటిని భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించి, గ్రామానికి వెళ్తునే గ్రామంలో ఉండే మనుషుల దగ్గరి నుంచి అందరూ ఆయనను గౌరవంగానే చూస్తారు. ఈ ద్వంద్వ అనుభవాల మధ్య నిర్ణయం కష్టమవుతుంది. పోలీసు యంత్రాంగంలో చాలా అవసరాలుండే గ్రామ పాలకులు ఈ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం వల్ల పోలీసుల పట్ల కొంత జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. ఇక సాధారణ ప్రజలకు పోలీసులంటే చాలా భయమే. పోలీసు కానిస్టేబుల్స్ అందరికి ఈ అనుభవం ఉంటుం ది. పోలీసు అధికారుల, వాళ్ల భార్యల (వాళ్లను దొరసానులని కూడా పిలుస్తుంటారు) పట్ల చాలా ఆగ్రహం ఉంటుంది. కానీ పేదవారి కోపం పెదవికి చేటు అనుకొని, వాళ్ల కోపాన్ని సాధారణ ప్రజల మీద, వాళ్ల కుటుంబాల మీద ప్రకటిస్తుంటారు. చాలాకాలం కానిస్టేబుల్ కుటుంబాలకు తమ భర్తల ప్రవర్తనకు నిజమైన కారణాలు తెలియక వాళ్ల హింసను భరిస్తూ వచ్చారు. సమాజం పరిణామం చెందుతున్న క్రమంలో, చైతన్యం కూడా పెరుగుతుంది. బహుశా పోలీసు కుటుంబాలకు ఇప్పుడు కొంత స్పష్టత ఏర్పడడం వల్ల తమ భర్తల మీద ఆగ్రహం దానికి కారణమైన ఆఫీసర్ల మీదికి మళ్లింది.
ఒక ఐజీ స్థాయి అధికారి మీద దాడి చేయడమంటే సాధారణమైన విషయం కాదు. మనుషుల్లో సహనం ఒక స్థాయి వరకే ఉంటుంది. అది దాటితే తిరుగుబాటే మార్గం. థామస్ పేన్ హక్కుల మీద రాసిన పుస్తకంలో సహనం, అసహనానికి వ్యతిరేకం కాదంటూ, రెండు కూడా ఒకే పరిణామానికి దారి తీస్తాయని, నాణానికి ఇవి రెండు వైపులు అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగింది అదే.
ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు, పిల్లలు ‘మాకు న్యాయం కావా లి అని నినాదాలు ఇచ్చారు. న్యాయం అడిగినంత మాత్రాన వచ్చేది కాదు ఇచ్చేది కాదు. గున్నార్ మిర్డాల్ తన ‘ఏషియన్ డ్రామా’ పుస్తకంలో మానవ చరివూతలో మనుషుపూపుడూ తమకుండే ప్రివిలేజెస్‌ను అంత సులభంగా తమకు తాము వదులుకోరు అని అంటాడు. బాలగోపాల్ కూడా ఒక సందర్భంలో మనుషులకు తమకు లేనిదానికి కొట్లాడడం తెలుసుకాని ఉన్నదాన్ని వదులుకోవడం తెలియదు అన్నారు. పోలీసు అధికారులు అంత సులభంగా తమ ప్రవర్తనను మార్చుకుని కానిస్టేబుల్స్‌ను గౌరవంగా చూడడం కాని, వాళ్లకు కూడా కుటుంబాలున్నాయని కాని గుర్తించడం అంత సులభం కాదు. దానికంటే మించి వాళ్లు మానవీయంగా మారితే విచ్చలవిడి అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదు.
మన దేశంలో అవలంబిస్తున్న అభివృద్ధి నమూనా పుణ్యమా అని రాబోయే కాలమంతా పోరాటాల కాలమే. నమూనా మారేదాకా సమా జం ఊపిరి పీల్చుకుంటుందని అనుకోలేం. ప్రతిరోజు కొత్త సమస్యలను సృష్టించి మనుషులను ముప్పు తిప్పలు పెడితే కాని సామ్రాజ్యవాద దేశాలకు, వాళ్ల ఏజెంట్లకు లక్షల కోట్ల ఆదాయాలు రావు. పోరాటాలు జరిగినంత కాలం పోలీసు బలగాలను ఉపయోగిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యంత్రాంగ అమానుషీకరణ అనివార్యంగా ఉంటుంది. శాంతి చర్చల సందర్భంలో నక్సలైట్ నాయకులు పోలీసుల సర్వీస్ నిబంధనల గురించి మాట్లాడితే పోలీసు ఆఫీసర్లు చాలా అభ్యంతరం చెప్పారు. అది మా అంతర్గత సమస్య అంటూ, బయటి వాళ్ల జోక్యం తాము ఒప్పుకోమని అన్నారు. వాళ్లు ఆర్డర్లీ వ్యవస్థ మీద ఉద్యమం చేసినప్పుడు దాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించినా, ఆఫీసర్లు ఆ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయ డం లేదు. ఉద్యమ ప్రాంతాలలో కానిస్టేబుల్ స్థాయి వారి పరిస్థితి కొంత మెరుగు.
అధికారులు అంత దురుసుగా ప్రవర్తించరు. అయితే వాళ్లు తమ కుటుంబాలకు దూరంగా ఏళ్ల తరబడి జీవించవలసి ఉంటుంది. సెలవులు రెండేళ్లకు ఒకసారి ఇస్తారని, తమ కుటుంబం కోసమని, ముఖ్యం గా పిల్లల చదువుల కోసం తాము చాలా సుదూర ప్రాంతాలలో పని చేస్తున్నామని బస్తర్‌లో పనిచేస్తున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ అన్నారు. మొన్న ఛత్తీస్‌గఢ్ కిడ్నాప్ సందర్భం లో రెండుసార్లు సీఆర్‌పీఎఫ్ క్యాంపు లో ఉండవలసి వచ్చింది. అప్పుడు కానిస్టేబుల్స్ జీవితాల్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు అభవూదత వల్ల బయటికి వెళ్లరు. 24 గంటలు క్యాంపులోనే ఉండాలి. వాళ్లకు అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ఒక గుడి మాత్రం కట్టారు. ఆ గుడిలో ఉదయం, సాయంత్రం గంటల తరబడి గొంతు చించుకునేలా భజన చేస్తారు. దేవుడు కూడా పోలీసు పాత్రను చాలా వరకు నిర్వహిస్తుంటాడు. దేవుడు అనే భావన లేకపోతే సమాజాన్ని నియంవూతించడం అంత సులభం కాదు. పోలీసుల పని మరింత క్లిష్టంగా మారుతుంది.
మొన్న జరిగిన పోలీసు కుటుంబాల పోరాట నేపథ్యం ఇది. ఒకవైపు కుటుంబం కోసమని, పిల్లల చదువు కోసమని విరామం లేకుండా పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు అండగా వారి కుటుంబాలు నిలబడి, తమ భర్తలను, తమ తండ్రులను మనుషులుగా చూడండి అనే పోరాటం చేయడం ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు ఒక కొత్త సవాల్. మనిషిని మనిషిగా చూడాలి అనే సుదీర్ఘ పోరాటంలో ఇదొక భాగం. సామాజిక సంబంధాలను సమక్షిగంగా చూసే దృక్పథాన్ని సమాజం, ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఈ కుటుంబాల పక్షాన నిలవడం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్య సంస్కృతి పెరిగితేనే కానిస్టేబుళ్ల బతుకు కొంత మారే అవకాశముంది.
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment