Sunday, October 28, 2012

వెంటాడే విజయ్ జ్ఞాపకాలు (2-8-2012)

అలెక్స్ పాల్ మీనన్ అపహరణలో కీలకపాత్ర నిర్వహించిన మడకాం విజయ్ మరణించాడన్న వార్త విన్నప్పుడు ఒకేసారి చాలా జ్ఞాపకాలు తరుముకొని వచ్చాయి. రెండు నెలల క్రితమే ఆయనను కలిసిన జ్ఞాపకాలు, గంటల తరబడి ఆయనతో చేసిన చర్చలు, ఆయన ముందుకు తీసుకువచ్చిన వాదనలు, బీడీ శర్మ మడకాం వాద వివాదాలు. అన్నింటికి మించి ఆయన ఇక భౌతికంగా లేడు అనే విషయం జీర్ణించుకోవడం కష్టమే అనిపించింది. ఆయన బస్తర్ అడవిలో ఉద్యమం పనిమీద ట్రాక్టర్ నడుపుతూ ఒక మలుపు దగ్గర ట్రాక్టర్ ఒక చెట్టుకు ఢీకొని స్టీరింగ్ ఎదకు తగిలి స్పృహ కోల్పోయి రెండు రోజుల తర్వాత మరణించాడని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఉద్యమంలోనే ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమై, ప్రజలతో మమేకమై ఒక ప్రత్యామ్నాయ సమాజం కోసం కలలుకనే వారు ఇలా మరణించడం పెద్ద విషాదం. మడకాం విజయ్ చాలా దృఢకాయుడు. ఆరు అడుగుల ఎత్తు. ముఖం మీద ఒక పట్టుదల, ప్రవర్తనలో చాలా సీరియస్‌గా ఉండడం, తక్కువగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వంలో నేను గమనించిన అంశాలు. మేము ఆయనతో గడిపిన దాదాపు పదిగంటలలో ఒకే ఒక్కసారి చిరునవ్వును గమనించాను. అయితే మా సంభాషణలో అది చాలా కీలకమైన నవ్వు. కలెక్టర్ అపహరణ అంశాన్ని పరిష్కరించడంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చాలా మొండి వైఖ రి తీసుకోవడంతో, పార్టీ నాయకత్వంతో కలిసి వాళ్ల డిమాండ్ల మీద చర్చించి, పార్టీ ఏమేరకు తమ డిమాండ్ల విషయంలో పట్టు సడలించగలదో, అలా గే ఏ డిమాండ్లు వాళ్ల దృష్టిలో ప్రధాన మో తెలుసుకోవడానికి పార్టీని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. మేం బస్తర్‌లో పార్టీ నిర్ణయించిన ప్రదేశానికి చేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. సాయంత్రం చేరుకోవడం వల్ల ఆ రాత్రి ఆదివాసీల మధ్యే ఉండే అవకాశం కలిగింది. అయితే మొదటి దఫా చర్చలో సీనియర్ నాయకుడు కామ్రేడ్ గణేశ్‌తో జరిగాయి. సాయం త్రం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు జరిగిన చర్చల్లో మడకాం విజయ్ పాల్గొన్నా, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం జరుగుతున్న చర్చ వింటున్నా, ఆయన వాటిలో చాలా సీరియస్‌గా పాల్గొన్నట్లుగానే అనిపించింది. మేము సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో తాడిమెట్లకు చేరుకోగానే దారి వెంటే కాక సమావేశ స్థలంలో చాలామంది ఆదివాసీలు మా కోసం ఎదురుచూస్తూ, మాకు ఆహ్వానం పలికారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ముఖ్యంగా సల్వాజుడుం చేసిన దాడులను, అమానుషమైన హత్యలను తమ కళ్లముందే తమ కుటుంబ సభ్యులను ఎలా సజీవ దహనం చేశారో ఒక కుటుంబం తర్వాత మరొక కుటుంబం వాళ్ల భాషలో వివరిస్తున్నప్పుడు మడకాం విజయ్ ట్రాన్స్‌లేటర్ పాత్రను నిర్వహించాడు. ఆయన స్వయాన ఆదివాసీ కావడం వల్ల సల్వాజుడుం బాధితుల బాధను మాకు హిందీలో, మేము హిందీలో అడిగిన ప్రశ్నలను బాధితులకు వాళ్ల భాషలో వివరించాడు. ఈ పని చాలా ఓపికగా దాదాపు మూడు,నాలుగు గంటలు చేశాడు. ఎక్కడ తన సొంత అనుభవాన్ని కాని, తన సొంత వివరణను కాని చేర్చలేదు. సమయం తక్కువ ఉండడంతో అందరి బాధలను వినడం సాధ్యం కాదని మేం అన్నా, ఒకరి తర్వాత ఒకరు రావ డం ఆగలేదు. ఆయనే కలగజేసుకొని వాళ్లకు పరిస్థితి వివరించి వాళ్లందరి మీద జరిగిన దాడులకు సంబంధించిన వివరాలను మాకు అందజేయమని ఒప్పించి, వాళ్లను తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసి పంపించాడు. పార్టీ నాయకుడు గణేశ్‌తో చాలా సుదీర్ఘమైన చర్చే జరిగింది. మూడు, నాలుగు అంశాల మీద పార్టీ వైఖరి, మానుంచి తాము ఆశిస్తున్న పాత్ర గురిం చి చాలా స్పష్టంగానే వివరించాడు. మేము బయటి పరిస్థితి గురించి, ప్రభు త్వ మొండి వైఖరి గురించి, మధ్యవర్తులకుండే పరిమితుల గురించి వివరిం చాం. గణేశ్ తెలుగువాడైనా బీడీ శర్మ, విజయ్‌కి తెలుగు రాకపోవడం వల్ల మొత్తం సంభాషణ హిందీలో జరిగింది. చర్చలో విజయ్ ఎక్కడా జోక్యం చేసుకోవడంకాని, మాట్లాడడంకాని చేయలేదు. అది పార్టీ క్రమశిక్షణా, లేక అది ఆయన ప్రవర్తనా తెలియదు. అడవి నుంచి రాయ్‌పూర్ చేరుకున్న తర్వా త ప్రభుత్వానికి పార్టీ అభివూపాయాలను మేము వివరించడమే కాక రాత పూర్వకంగా కూడా ఇచ్చాం. ప్రభుత్వ మధ్యవర్తులు ముఖ్యమంవూతితో, క్యాబినెట్ సభ్యులతో గంటల తరబడి చర్చించి, ప్రభుత్వ వైఖరిని, తమ సొంత అభివూపాయాలతో జోడించి చెప్పుతూ, ఒక అత్యున్నత కమిటీని వేస్తామని, కలెక్టర్ విడుదల అయిన ఒక గంటలో కమిటీ పని ప్రారంభిస్తుందని, డిమాండ్లను ముఖ్యంగా ఆదివాసీల విడుదల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని అనడంతో, మేం చర్చల నుంచి వైదొలుగుతామని అన్నాం. చేయండి అది మీఇష్టం, తాము కూడా మధ్యవర్తులమేనని తాము వెళ్లిపోతామని అనడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. మొత్తం సమస్యను అలా మధ్యలో వదిలివేయడం ఎలా అనే విషయంలో మేం కొంత ఉదారంగా ఉన్నామేమో అనిపిస్తుంది. మొత్తంగా ఒక రాజీ ఫార్ములా చేసి బయటి పరిస్థితుల, పరిమితుల దృష్ట్యా కలెక్టర్‌ను వదిలివేయాలని విజ్ఞప్తి చేయడంతో పార్టీ దానికి అంగీకరించింది. కలెక్టర్‌ను తీసుకపోవడానికి తమ మధ్యవర్తులే రావాలని పార్టీ కోరడంతో రెండవసారి మళ్లీ అడవికి వెళ్లవలసి వచ్చింది. ఈసారి కామ్రేడ్ గణేశ్ లేడు. కలెక్టర్‌ను అప్పగించే మొత్తం ప్రక్రియను కామ్రేడ్ విజయ్ నిర్వహించాడు. స్వయానా ఆదివాసీ కావడం వల్ల ఆదివాసీలు అనుభవించిన హింసను కళ్లా రా చూసిన వాడుగా, అపహరణలో కీలకపాత్ర వహించడం వల్ల మేం చేసిన విజ్ఞప్తి పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఆ అసంతృప్తి మాట్లాడినంత సేపు కనిపించింది. ఆయన దృష్టిలో మేం చర్చల నుంచి వైదొలిగితే బావుండేదని, కలెక్టర్‌ను విడుదల చేయాలనే విజ్ఞప్తి చేసి ఉండవలసింది కాదని అభివూపాయం వ్యక్తమైంది. చాలా ప్రశ్నలు అడిగాడు. ప్రతిఅంశాన్ని గురించి చాలా వివరంగా చెప్పిన తర్వాత, కలెక్టర్ అపహరణ నుంచి ఏం సాధించామో, ఆదివాసీలకు తాము ఏం సమాధానం చెప్పాలని సూటిగా అడిగాడు. దానికి మేం చాలా పెద్ద వివరణ ఇచ్చి బస్తర్ ఆదివాసీల సమస్యలు గత పది పన్నెండు రోజులుగా చర్చలోకి వచ్చాయని, ఆదివాసీల పట్ల పార్టీకుండే కమిట్‌మెంట్ సమాజానికి మరింత స్పష్టంగా అవగాహన అయ్యిందని, బస్తర్ ఆదివాసీల బాధల గురించి, వాళ్ల మీద జరిగిన హత్యాకాండ గురించి మేం బయటి ప్రపంచానికి తెలుపుతామని అని అన్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వి, చేతిలో చేయి కలిపాడు. ఈ చర్చ ముగిసిన తర్వాత కలెక్టర్ విడుదలకు మరికొంత సమయం ఉండడంతో, పార్టీ సిద్ధాంతం, ఆచరణ మీద నాకుండే ప్రశ్నలు, అనుమానాలు చర్చకు పెట్టాను. దాంట్లో భాగంగా బస్తర్ ఉద్యమమైనా లేదా మొత్తం మావోయిస్టు ఉద్యమం కేవలం హింసాత్మకమైనదని, రాజ్యాధికారం తప్ప వీళ్లకు వేరే ఏ ఆలోచన లేదనే ప్రచారం బాగా జరిగిందని చెపుతూ మానవీయ విలువలు, నూతన సమాజం గురించిన చర్చ, విశాల సమాజానికుండే సంక్షోభానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలు, మానవ విలువల పట్ల పార్టీకుండే వైఖరి మరింత స్పష్టంగా, సిద్ధాంతంతో ఆచరణలో వ్యక్తీకరింపబడాలనే మొత్తం చర్చను రికార్డు చేసుకున్నాడు. అది పార్టీ దృష్టికే తీసుకరావడానికే ఆ పని ఆయన చేస్తున్నాడని నాకు అనిపించింది. చేశాడో లేదో తెలియదు. ఆ తర్వాత తాను కొంత కఠినంగా ప్రవర్తించానని దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అంటూ పార్టీ విజ్ఞప్తి మేరకు మేం మధ్యవర్తుల బాధ్యత అంగీకరించినందుకు మాకు కృతజ్ఞతలు చెప్పాడు. మా ఇద్దరి సెల్ నంబర్లు తీసుకుని, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా, ఆదివాసీల మీద హింస జరిగినా మాకు తెలియజేస్తానన్నాడు. అలాంటి కామ్రేడ్ విజయ్ ఇంత త్వరలో తానే ఒక అపాయకర పరిస్థితిలో పడతాడని, ఆ అపాయం గురించి చెప్పే అవకా శం ఆయనకే లేకపోవడం విషాదం. ఆదివాసీలలో పుట్టి, వాళ్ల మధ్య పెరి గి, ఒక నాయకుడిగా ఎదిగి, బస్తర్ ప్రజలను ముందుకు నడిపించగలిగిన ఒక ఆదివాసీ నాయకుడి గొంతు మళ్లీ వినిపించదన్న నిజాన్ని అంత సులభంగా జీర్ణించుకోలేం. చర్చల సందర్భంలో ఈసారి ప్రభుత్వం సాయుధ చర్యతో కలెక్టర్ విడుదలకు ప్రయత్నం చేసే ఒక ప్రమాదం కూడా ఉందని మాకు అనిపించిందని అన్నప్పుడు, చావుకు మేం ఎప్పుడూ భయపడలేదు అని అన్న మాట మరిచిపోలేని జ్ఞాపకం.

No comments:

Post a Comment