Sunday, October 28, 2012

కామన్‌స్కూల్: ప్రజాస్వామిక ఆవశ్యకత (5-1-2012)

పిల్లలందరికి సమాన అవకాశాలుండి నాణ్యమైన విద్య అందుబాటులో కి తేవాలనే భావనను ఇంతకు ముందే ఈ వ్యాస పరంపరలో పేర్కొన్నాను. అందరికి సమానమైన నాణ్యమైన విద్య అనేది అంత విప్లవాత్మకమైన భావనేమీ కాదు. ఇది ఇప్పుడు చాలా వరకు పెట్టుబడిదారీ దేశాల్లో ఆచరణలో ఉంది. ప్రపంచం మీద నయా ఉదార అభివృద్ధి వలను వేసిన అమెరికా దేశంలో ఇప్పటికే కామన్ స్కూల్ థ్రూ నైబర్ హుడ్ స్కూల్ అమలులో ఉంది. అమెరికాలో ప్రైవేటు బళ్లు చాలా అరుదు. కామన్ స్కూల్ పద్ధతిని పెట్టుబడిదారీ దేశాల్లో ప్రోత్సహించడానికి పెట్టుబడి అవసరం కూడా ఉంటుంది. పెట్టుబడికి కావాల్సిన మానవ వనరులు విస్తృతంగా సృష్టించుకోవడానికి, ఆదాయాలు తక్కువవున్న కుటుంబాల నుంచి కూడా ప్రతిభ కలిగినవాళ్లు తయారైతే పెట్టుబడికి ప్రయోజనమనేది దీంట్లో ఉంది. స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్, డెన్‌మార్క్, ఫిన్‌లాండ్ లాంటి దేశాల్లో స్కూలు విద్యే కాదు మొత్తం విద్య (ఉన్నత విద్యతో సహా) ప్రభుత్వ రంగంలోనే ఉంది. మొన్నకుమొన్న నియంతృత్వాలకు, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా, పోరాడి నూతన స్వేచ్ఛను పొందిన వెనిజులాలో చావేజ్ ప్రవేశపెట్టిన ప్రధానమైన మార్పులలో స్కూలు విద్యను ప్రజాస్వామీకరించడం ఒకటి. ప్రపంచంలో భిన్న ప్రాంతాల్లో కామన్ స్కూల్ భావన ఆచరణలో ఉన్నా, మన దేశంలో విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన సందర్భంలో కూడా కామన్ స్కూల్ విధానాన్ని అంగీకరించకపోవడం ఒక మహాపరాధం. కామన్ స్కూల్ విధానం మన దేశానికి మొత్తంగా ఒక కొత్త ప్రతిపాదనేం కాదు. 1985 వరకు స్కూళ్లు, కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. గ్రామంలో ఒకే స్కూలు ఉండేది. గ్రామంలోని పిల్లలందరూ అదే స్కూలుకు వెళ్లేవారు. గ్రామంలో ఉన్నత కులాల, వర్గాల పిల్లలు, పేద వర్గాల దళిత పిల్లలు ఒకే స్కూలుకు వెళ్లేవారు. అయితే గ్రామంలో ని చదువుకునే వయసులో ఉండే పిల్లలందరు బడికి వెళ్లేలా ప్రయత్నం చేయకపోవడం నెహ్రూ అభివృద్ధి నమూనా చేసిన చారివూతక తప్పిదం. నెహ్రూ కూడా క్యూబాలో క్యాస్ట్రో లాగో, చైనాలో మావో లాగో పిల్లలందరికి ఉచిత నిర్బంధ విద్య ప్రవేశపెట్టి దానిని పకడ్బందీగా అమలుపరిచి ఉంటే ఈరోజు పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. అలా చేయకపోవడం వలన సామాజిక అసమానతలు కొనసాగడమే కాక, పేద వర్గాల నుంచి వచ్చే అశేషమైన ప్రతిభను సమాజం కోల్పోయింది. అయితే ఉన్న మేరకు మాత్రం అవి కామన్ స్కూళ్లే. అందుకే ఆ రోజుల్లో గ్రామంలోని స్కూలు బాగా నడిచేలా గ్రామంలోని పలుకుబడి గలవారు చాలా శ్రద్ధ తీసుకునేవారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మా గ్రామం మొగిలిగిద్దలో స్కూలునే ఉదాహరణగా తీసుకుందాం. ఈ ఉదాహరణ ఈ వ్యాస సందర్భానికి చాలా ఇముడుతుంది. మాది దాదాపు స్వాతంవూతోద్యమం ముగి సి, స్వతంత్ర దేశంలో ఎదిగిన తరం. మాది మొట్టమొదటి హైస్కూల్ బ్యాచ్. మా తరగతిలో మేం 16 మంది విద్యార్థులం. మా గ్రామమే కాక దాదాపు చుట్టూ ఉండే 15,20 గ్రామాలకు ఇదొక్కటే హైస్కూ లు. మా తరగతిలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కుల పరంగా ముగ్గురు బ్రాహ్మణ, నలుగురు రెడ్డి, ముగ్గురు దళిత (ఒకరు మాదిగ, ఇద్దరు మాల) ఐదుగురు ఇతర వెనకబడిన కులాలకు చెందినవారు. ఒక్క అమ్మాయి మాత్రమే ఉండేది. ఇతర వెనుకబడిన కులాలలో మంగలి, కమ్మరి, సాలె, గొల్ల, జంగమ కులాలకు చెందిన వాళ్లు. అంటే భిన్న కులాల వాళ్లున్నారు. ఇందులో లింగయ్య (మంగలి) క్లాసులో గణితంలో వందమార్కులు తెచ్చుకునే వాడు. శంకర్ (వడ్రంగి) హెచ్‌ఎస్‌సిలో ఫస్టుక్లాసు సాధించాడు. ఆ రోజుల్లో ఫస్టుక్లాసు అంటే జిల్లా వ్యాప్తంగా అలాంటి విద్యార్థుల గురించి మాట్లాడుకునేవారు. టీచర్లు అంద రూ గ్రామంలోనే ఉండేవాళ్లు. వాళ్ల పిల్లలు మా స్కూళ్లోనే చదువుకునేవారు. ఈ రోజు కామన్‌స్కూలు అని అంటూనే అడిగే ప్రశ్నలన్నింటికి మా అప్పటి స్కూలు, అది నడిచిన విధానమే సమాధానాలు చెపుతుంది. నివాస ప్రాంతంలో కామన్ స్కూలును కొఠారీ కమిషన్ ప్రతిపాదించింది. దానికి కావలసిన తాత్విక సామాజిక కారణాలను బలంగా ముందుకు తీసుకవచ్చింది. సంపన్నుల, పేదల, ఉన్నత కులాల, అణచివేయబడ్డ కులాల పిల్లలందరు ఒకే పాఠశాలలో చదవడం వలన వచ్చే మార్పును మనం సరిగా అంచనా వేయడం లేదు. దాదాపు 50,60,70 దశాబ్దాలలో మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కామన్ స్కూల్ విధానమే ఉండేది. కొన్ని ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నా ఉపాధ్యాయుల జీతభత్యాలు ప్రభుత్వమే భరించేది. ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తీసుకున్న తర్వాతే విద్యా విధానంలో మార్పు వచ్చింది. దీనికి అణగారిన కులాల, వర్గాల నుంచి చదువుకున్న వాళ్లు వ్యవస్థను, ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఒక తరం రావడం కూడా ఈ మార్పుకు కారణం కావచ్చు. మూడున్నర దశాబ్దాల తర్వాత విద్యా విధానంలో వచ్చిన మార్పును మనం ప్రతిఘటించలేకపోయాం.1985 నూతన విద్యా విధానం అంతకాలంగా గ్రామాలోని పిల్లలంతా తమ గ్రామంలోని స్కూళ్లో చదివే పద్ధతి మరింత బలీయం చేసి, పిల్లలందరిని బళ్లో చేర్పించే విధానం అమలు పరచకుండా, దాని స్థానంలో నవోదయ పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలలు ప్రారంభించడమే కాక, కార్పొరేట్ పాఠశాలలకు తలుపులు తెరిచేలా చేసింది. దీనివల్ల ‘మను ధర్మశాస్త్రం’ ఒకవైపు, మెకాలె మరొకవైపు అల్లిన సాలెగూడులో విద్యా విధానం చిక్కుకపోయింది. ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క కులానికి తగ్గ బళ్ళు రావడం ప్రారంభమైంది. ఏ విద్యా విధానం ద్వారా సామాజిక మార్పు వస్తుందని ఆశించామో, ఆ విద్యే నిచ్చెనమెట్ల సమాజానికి భూమికై కూర్చుంది. హైదరాబాద్‌లో నేడు పనిచేస్తున్న సూళ్ళ ‘వైవిధ్యాన్ని’ వైపరీత్యాన్ని పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలో ఎన్ని కొత్త సంపన్న వర్గాలు ఏర్పడ్డాయో చెప్పవచ్చు. కొన్ని స్కూళ్లల్లో రెండు నుంచి మూడు లక్షల రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. ఆ స్కూళ్లు పిల్లలకు ఏ సామాజిక, చారివూతక, ప్రకృతి రహస్యాలను చెబుతాయో తెలియదు ఆ స్కూళ్లకు పిల్లలను పంపే తల్లిదంవూడులు పిల్లల చదువుకంటే కూడా తమ సామాజిక హోదాను చాటుకోవడానికి పంపిస్తున్నారు. ఈ పిల్లలు ఎంతమంది మా స్కూళ్లో చదివిన మా లింగయ్యతో కానీ శంకర్‌తో కాని పోటీ పడగలరో తెలియదు. భిన్న కారణాల వల్ల ఆరు దశాబ్దాల తర్వాత విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా అంగీకరించాం. చివరకు 2009లో ఉచిత నిర్బంధ విద్య చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టాన్ని గురించి చాలానే రాయవలసి ఉంది. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది కామన్ స్కూల్ అంశం. విద్యను ప్రాథమిక హక్కుగా అంగీకరించిన తర్వాత భిన్నమైన స్కూళ్ల అవసరం ఏముంటుంది? కనీసం రాబోయే తరాలకైనా సమానమైన విద్యా అవకాశాలు ఉండాలి కదా? మన దేశంలో సంపదను,అధికారాన్ని పంచడానికి సిద్ధంగా లేము. కనీ సం విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చి, నాణ్యమైన ప్రయోజనాత్మకమైన విద్యను అందించడానికి సిద్ధంగా లేకపోతే నామమాత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఎక్కువ కాలం బతకలేదు. ఒక నాగరిక సమాజ నిర్మాణం అసాధ్యం. కామన్ స్కూల్ అని అన్నప్పుడల్లా ప్రభుత్వ పాఠశాలలు ఏం చేస్తున్నాయి? ఉపాధ్యాయులు బడికి వెళ్తున్నారా? నాణ్యతలేని విద్య ఎవరికి కావాలి? మా పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్లల్లో చదువుకోవద్దా? టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇలా ప్రశ్న ల వర్షం కురిపిస్తున్నారు. దీనికి జవాబు మా 1960 మొగిలిగిద్ద స్కూలే! నేను ఆ స్కూలులోనే తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇప్పుడు అణగారిన వర్గాల తరఫున ప్రతిభావంతంగా మాట్లాడుతున్న వాళ్లు, రాజకీయ నాయకులు, ముఖ్యమంవూతులు, ఐఏఎస్ ఆఫీసర్లు, శాస్త్రవేత్తలు, అబ్దుల్ కలాం అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లే. కవులు, కళాకారులు, రచయితలు వందకు వంద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్లే. కామన్ స్కూల్ మీద ఎందుకు అన్ని భయాలు, సందేహాలో అర్థం కాదు. ఒక్కసారి మనం కామన్ స్కూల్ విధానాన్ని అంగీకరించి, అమలు చేస్తే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయి. నిర్బంధ ఉచిత విద్య చట్టంలో కార్పొరేటు స్కూళ్లకు చట్టబద్ధత కల్పించడం కోసం 25 శాతం పేద పిల్లలను చేర్చుకోవాలని చట్టం చెపుతుంది. ఈ పద్ధతే తప్పు అని అంటే మా పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు పోకూడదా? అని వాదిస్తున్నారు. దీనికి సమాధానం పేద వర్గాల నుంచి 25 శాతం మంది కార్పొరేట్ స్కూళ్లకు వెళితే, మరి మిగతా 75 శాతం సంగతేమిటి? వాళ్లకు నాణ్యమైన, సమానమై విద్య వద్దా? పేదల నుంచి 25 శాతం బాగుపడితే మిగతా 75 శాతం మంది మా పిల్లల సంగతి ఏంటి అని అంటే ఎవరైనా చెప్పే సమాధానం ఏమి టి? విద్య సమాజాన్ని సంఘటిత పరచాలే కాని విభజించకూడదు. విపరీతమైన విభజనకు గురైన నిచ్చెన మెట్ల సమాజాన్ని నిలువునా కాక అడ్డంగా మలపడమే విద్య పని. ఆ సామాజిక, సమష్టితత్వ, సమసమాజ వాతావరణాన్ని సృష్టించే శక్తి ‘కామన్ స్కూల్’ విద్యా విధానానికి మాత్రమే ఉంటుంది. కామన్ స్కూల్ విద్యావిధానంలో బోధనా భాష ఏముండాలి, కరికులం ఎలా ఉండాలి, సామాజిక నియంవూతణ ఎలా పెంచాలి అన్న సమస్యలను కూడా లోతుగా విశ్లేషించుకోవలసిన అవసరముంది.

No comments:

Post a Comment