(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
కామన్ స్కూల్ వ్యతిరేక వాదనలు (12-1-2012)
గత రెండు నెలలుగా బెంగుళూరు లా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యార్థులకు మానవ హక్కుల రాజకీయ ఆర్థిక నేపథ్యాన్ని, అందు లో భాగంగా మన దేశ సామాజిక, ఆర్థిక సందర్భాన్ని వివరిస్తున్న క్రమంలో విద్యా హక్కు గురించి, కామన్ స్కూల్ ఆవశ్యకత గురించి ఇచ్చిన లెక్చర్‌కు చాలా మంది విద్యార్థుల నుంచి పెద్ద ఎ త్తున వ్యతిరేకత వచ్చింది. క్లాసులో దాదాపు ఒక తిరుగుబాటు వాతావరణం ఏర్పడింది. నాలుగున్నర దశాబ్దాల నా బోధనానుభవంలో ఇలాంటి ‘స్పందన’ చాలా అరుదుగా చూశాను. ఈ విద్యార్థులు దేశంలో 20 వేల మంది అభ్యర్థుల నుంచి ఎన్నిక చేయబడిన 80 మంది టాప్ విద్యార్థులు. అంటే బలీయమైన వర్గాల భాషలో చెప్పాలంటే ‘అత్యంత ప్రతిభ’ కలిగినవారు.
వీళ్ల తల్లిదంవూడులు చాలా మంది ఐఏఎస్ అధికారులు, డాక్టర్లు, లాయర్లు, కొంత మంది సైనిక అధికారుల పిల్లలు. ఈ కోర్సులో చేరిన ముప్ఫై మందిలో గ్రామీణ ప్రాంతాలకు కానీ, వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు కానీ లేరు. ఒకరు ఇద్దరు దళిత నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు. వాళ్లు కూడా డాక్లరు లేదా ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు. ఈ విద్యార్థులను మనం పూర్తిగా నిందించలేం. వాళ్లందరు పబ్లిక్ స్కూల్, కార్పొరేట్ స్కూళ్లలో, మహానగరాలలో చదివిన వారు. అందుకే వాళ్ల దృక్పథం చాలా భిన్నంగా ఉంది. అది వాళ్ల సామాజిక వర్గ దృక్పథం.
విద్యార్థుల వాదనలో ప్రధానమైంది- విద్య విషయంలో తమ పిల్లలను ఎక్కడ చదివించాలో నిర్ణయించే స్వేచ్ఛ తల్లిదంవూడులకు ఉండాలని, ఎవరు ఏ స్కూలుకు వెళ్లాలి అనే నిర్ణయం ప్రభుత్వం చేతిలో పెట్టడం భావ్యం కాదని, ఇది వ్యక్తి స్వేచ్ఛ కు వ్యతిరేకమని. రెండవది సమాజంలో భిన్న ఆర్థిక, సామాజిక శ్రేణులున్నపుడు, ఏ శ్రేణికి చెందిన వారు వాళ్ల ఆర్థిక స్థోమతను బట్టి తమకు ఉచితమనుకున్న స్కూలును ఎన్నుకుంటారని, ఆదాయాలు ఎక్కువున్న వాళ్లు కార్పొరేటు స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉండాలనేది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి తాము వ్యతిరేకులము కాదని, అయితే మమ్మల్ని నిర్బంధంగా ప్రభు త్వ పాఠశాలలకు వెళ్లమనడం సముచితం కాదనే వాదన ముందుకు తెచ్చారు. మరొక వాదనలో ఆదాయాలున్న కుటుంబాల పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు వెళ్లడం వలన ప్రభుత్వం మీద భారం తగ్గుతుందని, అలా ఆదా అయిన వనరులను పేద విద్యార్థులు చదువుతున్న స్కూళ్ల మీద ఖర్చు పెట్టవచ్చని అంటూ నాణ్యతలేని ప్రభుత్వ స్కూళ్లకు మేమెందుకు వెళ్లాలని, ఆ స్కూళ్లు నాణ్యమైన విద్యను అందించలేవని కరాఖండిగా అభివూపాయపడ్డారు.
ఈ విద్యార్థుల్లో ఆరుగురు విదేశీ విద్యార్థు లు. అమెరికా విద్యార్థిని ఒకరు తమ దేశంలో కామన్ స్కూల్ విద్యావిధానం అమలులో ఉన్నదని, అయితే తెలివితేటల దృష్ట్యా మెరుగుగా ఉంటే పిల్లలకు సాధారణమైన విద్యార్థులతో బాటే విద్యనభ్యసించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అభివూపాయపడింది. ఈ సమస్యతో పాటు కామన్ స్కూలు ఉన్న నివాస ప్రాంతం వాళ్ల ఆదాయాలు తక్కువగా ఉండడం వలన ఆ స్కూలు వనరులు కూడా తక్కువే ఉంటాయి. దానివలన స్కూలు విద్యలో కొంత నాణ్యత, సౌకర్యాలు తక్కువ ఉంటాయి. సంపన్న ప్రాంతాలలో ఉండే పాఠశాలలు మెరుగుగా ఉంటాయి.
నయా ఆర్థిక విధాన పుణ్యమా అని అమెరికాలో కూడా కామన్‌స్కూలు విద్యకు స్వస్తి చెప్పాలని మిల్టన్ ఫ్రైడ్‌మాన్ లాంటి ఆర్థిక శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తున్నారు. న్యూ ఆర్లియెన్స్‌లో ప్రకృతి బీభత్సం వలన జీవనం అస్తవ్యస్తమైన ప్రజలు నిత్య జీవితాన్ని నిలబెట్టుకొనడానికి పోరాడుతున్న తరుణంలో కామన్ స్కూళ్ళను మూసి, ఆ కుటుంబాలకు ఓచర్లను ఇచ్చి పిల్లలను ఇతర స్కూళ్లకు పంపే పద్ధతిని ప్రవేశపెట్టారు. నయా ఆర్థిక విధానం సంక్షేమ భావన మానవ జ్ఞాపకం నుంచి రద్దుకానంత వరకు కమ్యూనిజం బీజ రూపంలో బతికి ఉన్న భావిస్తున్నారు. దీనికి భిన్నంగా అమెరికన్ ఫెడరల్ న్యాయస్థానం అమెరికాలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికుండడానికి కామన్ స్కూళ్ల పాత్ర చాలా కీలకమైందని ఒక సందర్భంలో పేర్కొన్నది.
కామన్‌స్కూలు భావనను అంగీకరించడానికి ముందుగా వ్యక్తి స్వేచ్ఛ, సమష్టి ప్రయోజనం మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించవలసి ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛ అపరిమితమైందా లేక దానికి సామాజిక, ఆర్థిక పరిమితులున్నాయా అని ప్రశ్నిస్తే, స్వేచ్ఛ సమానత్వ భావన మధ్య ఘర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఘర్షణను పరిష్కరించడం న్యాయ భావన ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది. ఏ సమాజమైన తన నాగరికత భవనాన్ని న్యాయ భావన పునాదుల మీద నిర్మించవలసి ఉంటుంది. మనుషులంతా సమానమే అని అంటే, భిన్నమైన మనుషులు సమానమెలా అవుతారు అనే ప్రశ్న కూడా వస్తుంది.
అందుకే డాక్టర్ అంబేద్కర్ సమానత్వ భావన గణిత సమానత్వం కాదు అని అన్నాడు. మనుషులు మనుషులుగా ఎదగడానికి, తమలో నిగూఢంగా ఉండే శ్రమశక్తిని, సృజనాత్మకతను వ్యక్తీకరించుకొనడానికి తగిన అవకాశాలుండడం. సమాజంలో ఉండే ఆర్థిక అసమానతల వలన కొందరికి చాలా అవకాశాలు, మరికొందరికి అసలే అవకాశాలు లేకపోవడమనేది అనాగరికం. అందరికి సమా న అవకాశాలు అందుబాటులో ఉండడం మానవ ప్రవృత్తి వికాసం చెందడానికి చాలా అవసరం. ఒకరి అపరిమిత స్వేచ్ఛ మరొకరు మానవీయంగా ఎదగడానికి ప్రతిబంధకం కానంత వరకే నిలుస్తుంది. లేకుంటే ఇతరులు ఆ స్వేచ్ఛను మౌలికంగానే ప్రశ్నిస్తారు, ప్రతిఘటిస్తారు. అందుకే కామన్ స్కూల్ అంటే స్వేచ్ఛ వద్దని కాదు, అందరూ స్వేచ్ఛగా ఎదగడానికి సమాన అవకాశాలుండాలనేది మాత్రమే ఇందులోని సారాంశం.
ఈ సమస్య మీద రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐన్‌స్టీన్ స్పందిస్తూ ‘సోషలిజం ఎందుకు’ అనే వ్యాసంలో చాలా లోతుగానే విశ్లేషించారు. ఆధునిక సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ మనుషులను ఒంటరి మనుషులుగా మారుస్తున్నదని వ్యాఖ్యానిస్తూ,నిజానికి పూర్వ కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగనప్పుడు మనిషి, కుటుంబం తమకు తాము ఏమైనా మనగలిగాడేమో కాని, 20వ శతాబ్దపు మనిషి జీవితం సంపూర్ణంగా సామాజిక సహకారం మీద ఆధారపడి ఉన్నదని, మనిషికి, సమాజానికి ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో బంధం ఏర్పడిందని అంటూ ఇతరుల సహకారం లేకపోతే మనిషి నిస్సహాయుడని విశ్లేషించాడు. సామాజిక బంధాలు పెరిగిన కొద్దీ తన అసహాయత వలన సమాజాన్ని ద్వేషిం చే దిశగా ప్రయాణం చేస్తున్నాడని విశ్లేషించాడు. అందుకే ఒంటరి మనిషి సామాజిక మనిషిగా (సోషల్ బీయింగ్)పరిణామం చెంది తన వికాసాన్ని సామాజిక సమష్టి అభివృద్ధిలో భాగంగా చూడడం నేర్చుకోవాలని ప్రతిపాదించాడు.ఈ తాత్విక లోతులలోకి వెళ్ళకుండా మా స్వేచ్ఛ మాది, నా కోసం నేను బతుకుతాను అని అనడం అది స్వేచ్ఛ కాదు. ప్రస్తుత సందర్భం నుంచి బయటపడే పలాయనవాదమే.
అందరికి సమానమైన అవకాశాలుంటే విద్య మార్కెట్ ద్వారా సాధ్యం కాదు. మార్కెట్‌కు న్యాయభావన ఉండదు అని చాలా సందర్భాల్లో నేను పేర్కొన్నాను. న్యాయాన్ని మార్కెట్ నుంచి మనం ఆశించకూడదు. అయితే ఇది రాజ్యం నిర్వహించగలదు. ప్రభుత్వం నడిపే స్కూళ్లలో నాణ్యత ఎలా ఉంది అన్న విషయం పరిశీలిస్తే- భిన్నమైన స్కూళ్లు ఉన్నప్పుడు, మార్కెట్‌కుండే చాకచక్యం ఇతర సామాజిక సంస్థలకుండదు. కార్పొరేట్ స్కూళ్ల ప్రచార హోరుకు తట్టుకోవడం చాలా కష్టం. విద్యను, విజ్ఞానాన్ని మార్కెట్ వస్తువుగా మార్చిన నయా ఆర్థిక విధానం ఎంత అమానుషమైందో మనం అర్థం చేసుకోవాలి. విద్య, విజ్ఞానం అందరికీ అందుబాటులో లేకపోతే అది ప్రజాస్వామ్య సమాజం కాజాలదు.
కామన్ స్కూల్ భావనను అంగీకరించకపోతే ఇప్పుడు కాకున్న ఎప్పుడైనా సమాజంలో ఆర్థిక అసమానతల మీద నష్టపోయినవారు తప్పక మౌలికమైన ప్రశ్నలను అడుగుతారు. నేనెందుకు పేద కుటుంబంలో పుట్టాను, మా పేదరికానికి కారణాలేమిటి అనే ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. కామన్ స్కూలు భావనను వ్యతిరేకిస్తున్న వాళ్ళు రాబోయే కాలంలో మౌలిక ప్రశ్నలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. సమాధానాలు, ఇప్పుడు వాదించినంత సులభంగా ఉండవు. సమాజాలు తక్కువలో తక్కువ ఘర్షణతో మారాలని ఆశించే వాళ్ళందరూ కామన్ స్కూలు భావన గురించి తీవ్రంగా ఆలోచించాలి.
Labels:
నమస్తే తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment