Sunday, October 28, 2012

నీళ్లులేక పాలమూరు కన్నీళ్లు (13-9-2012)

పాలమూరు జిల్లా కరువు గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోవడమే తప్ప, సమస్య పరిష్కారం జరగడం లేదు. ఆకలి, దప్పి ఉండే దాకా అలసిపోవడానికి వీలులేదు. పౌర హక్కుల సంఘం ఎన్‌కౌంటర్ల మీద వాస్తవ నిర్ధారణ కమిటీలలో తిరుగుతున్నప్పుడు ఒకసారి బాలగోపాల్‌తో ఎవరో మిత్రుడు ఎన్ని రోజులని మనం ఇలా వాస్తవ నిర్ధారణ కమిటీలు వేసి తిరుగుతుంటాం అని అంటే ‘చంపేవాడే’ అలసిపోనప్పుడు దీనిని ప్రజలకు చెప్పేవాళ్ళు అలసిపోతే ఎట్లా అన్నాడు. అలాగే పాలమూరు గురించి ఎన్నిసార్లు చెపుతారు అంటే అలసిపోకుండా నీళ్ళు వచ్చేదాకా, పాలమూరు రాజకీయ నాయకుల హృదయాలు కరిగి నీళ్ళయ్యేదాకా, ప్రభుత్వాలు సమస్యను నిర్దిష్టంగా పరిష్కరించే దాకా, పాలమూరు ప్రజలు నీళ్ళ కోసం రాజీలేని పోరాటాలు చేసేదాకా, చదివే వారికి ఎంత ఇబ్బందైనా, ఎంత విసుగు వచ్చినా, చెబుతూనే ఉండాలి. వాళ్ళే మళ్ళీ చెప్పడానికి ఇది ఒక సరైన సందర్భం కూడా. తెలంగాణ ఉద్యమం పాలమూరు సమస్యను సమక్షిగంగా అవగాహన చేసుకొని రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించేలా తెలంగాణ సమాజాన్ని సంసిద్ధం చేయాలి. పాలమూరు కరువు, వలసల వల్ల జరిగే మానవ హననానికి రాజకీయాల్లో చాలా మానవీయమైన నాయకత్వం వచ్చి ఉండవలసింది. అవి కొంత వరకు వనపర్తి బాల కిష్టయ్య,మహేంవూదనాథ్‌లలో కనిపించినా తర్వాత వచ్చిన నాయకత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రాజా రామేశ్వరరావు వనపర్తి ప్యాలెస్‌ను పాలిటెక్నిక్ కాలేజీకి ఇచ్చి తన దాతృత్వాన్ని కొంతైనా చాటుకున్నాడు. కాని తర్వాత వచ్చిన నాయకులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని లాభాల వేటలో పడ్డారు. రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద భూస్వాములకు, అగ్ర కులాలకు నాయకత్వ అవకాశాలు ఇచ్చిందని, ఆ పెత్తందారీ ఆధిపత్యం నుంచి బయటపడడానికి, వెనుకబడిన కులాలు, తరగతులు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాయి. ఈ పార్టీకి చాలాకాలం తిరుగులేని మద్దతునిచ్చాయి. ఎన్టీ రామారావు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు కూడా. ఇవన్నీ ప్రజలను భ్రమలకు గురిచేయడానికి పనికొచ్చాయి, కానీ వారి జీవితాలు మెరగుపడడానికి కాదు. మేం పిల్లలుగా ఉన్నప్పుడు మా గ్రామంలో దాదాపు పది బావులలో ఎండాకాలం లో కూడా సమృద్ధిగా నీళ్లుండేవి. మేమందరం గంటల తరబడి ఈతలు కొట్టిన వాళ్లమే. బోలెడన్ని మంచినీళ్ల బావులుండేవి. ఈ బావుల్లో నీళ్లు ఎనిమిది, తొమ్మిది ఫీట్లలో ఉండేవి. వర్షాకాలంలో చేతులకు తగిలేంతపైకి నీళ్లుండేవి. మా ఊరి గిద్ద నిండా నీళ్లుండేవి. అవి గ్రామం గుండా ఊరి దొర భూమికి పారేవి. కానీ నిరంతరంగా పారే కాలువ గ్రామానికి ఎంతో అందాన్నిచ్చేది. హరిత విప్లవ పుణ్యమా అని మొత్తం వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, విపరీతంగా నీళ్ల అవసరాలున్న పంటలను పండించడం వల్ల వ్యవసాయ పునాదులు విధ్వంసం అయ్యాయి. వందల సంవత్సరాల రైతుల అనుభవం కాని, వ్యవసాయ పంటలను విస్మరించి ‘ఫోర్డు ఫౌండేషన్’ ప్రేరేపిత వంగడాలను ప్రవేశపెట్టడం దేశ పాలకుల దివాళాకోరుతనాన్ని చాటుతున్న ది. మా బాల్యంలో మా నాన్న వచ్చిన వాళ్లందరితో జపాన్ వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడితే, జపాన్ తరహా పంటలు పండించే వాళ్లకు ప్రభుత్వ రాయితీలున్నాయని చెప్పేవాడు. నిజానికి జపాన్‌లో భూ కమతాలు చాలా చిన్న వి. ఎవరికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండదు. జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి, అత్యంత సంపద సృష్టికి భూ సంస్కరణలు కూడా తోడ్పడ్డాయి. జపాన్‌ను కాదని వేల ఎకరాలు సంపూర్ణ యాంత్రీకరణ ద్వారా చేసే అమెరికా నమూనాను మన రైతాంగం మీద ఏ మాత్రం దూరదృష్టి లేకుండా రుద్దడంతో వ్యవసాయ రంగం చాలా సంక్షోభానికి గురైంది. ఈ నమూనాకు కీలకం నీళ్లు. పాలమూరు జిల్లా లాంటి జిల్లాలో రైతులు నీళ్లవేటలో, చేదుడు బావులు, మోట బావుల నీళ్లు సరిపోక బోరుబావులను ఆశ్రయించారు. బోరుబావులు చిన్నపిల్లలు చనిపోవడానికి కారణమయ్యాయి. కానీ రైతుల స్థితిని మార్చడానికి, వాళ్ల జీవితాలు మెరుగుపడడానికి ఏ మాత్రం పనికి రాలేదు. ఇది సరిపోక మన దుర్మార్గ పాలకుల సామ్రాజ్యవాద ప్రేరిత వాణిజ్య వ్యవసాయాన్ని ప్రపంచీకరణలో భాగంగా ప్రవేశపెట్టారు. కొంచెం బుద్ధి ఉన్నవాళ్లైనా దీర్ఘకాలిక పరిణామాలను, పర్యవసానాల గురించి ఆలోచిస్తారు. ఆ బుద్ధి కొరవడడంవల్ల మనం పెద్ద గోతిలో పడిపోయాం. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానం చిన్న కమతాలకు పనికి రాదు. వాణి జ్య పంటలు వేయడానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే అప్పు చేయవచ్చు. కానీ నీళ్లను ఎలా సృష్టిస్తారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డవాళ్లు గుర్తించుకోవలసింది, భూగర్భంలో నీళ్లేమీ నిలువ ఉండవు. ప్రతి సంవత్సరం పడే వర్షపు నీళ్లే భూమిలోకి ఇమిడి భూమి లోపల నిలువ ఉంటాయి. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న పాలమూరు జిల్లా లాంటి ప్రదేశాలు, భూమి నుంచి బోరుల ద్వారా భూమిలో ఇమిడిన నీళ్లకంటే ఎక్కువ వాడడం వల్ల, నీళ్లు తగ్గి సంక్షోభం పెరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన వ్యవసాయ పద్ధతుల తీవ్రతకు తట్టుకోలేక రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపించిన సామ్రాజ్యవాద యుద్ధం. దేశాలనన్నింటిని తమ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడేవిగా చేసే ‘కువూట’లో ఇదొక భాగం. హరిత విప్లవం, నూతన ఆర్థిక విధానాల వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇప్పు డు బయట పడడం అంత సులభం కాదు. ఈ దేశం లో విప్లవం విజయవంతమైనా, ఆ పాలనకు కూడా ఇది చాలా పెద్ద సవాలే. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నదీ జలాలను న్యాయబద్ధంగా పంచాలి. నదులు లేని ప్రాంతాల గతి ఏమిటి అంటే, అది ఒక భిన్న సమస్య. కాని నీళ్లు సమృద్ధిగా కృష్ణానదిలో దాని ఉప నదుల్లో పారుతున్న పాలమూరుకు నీళ్లు లేకపోవడం ఎంత పెద్ద విషాదం. అందుకే పాలమూరు ప్రజలకు నదీ జలాల్లో తమ వాటా అడగడం తప్ప వేరే గత్యంతరం లేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పట్టించుకోనప్పుడు ప్రజా ఉద్యమాలే పరిష్కారాన్ని సాధిస్తాయి. పాలమూరులో చాలా చైతన్యవంతమైన ఆ ఉపాధ్యాయ వర్గం, అలాగే భిన్న ప్రజా సంఘాలున్నాయి. ప్రజల హక్కుల కోసం ప్రాణాలిచ్చిన పురుషోత్తం, కనకాచారి, మునెప్ప లాంటి వాళ్లను పాలమూరు జిల్లా కని పెంచింది. చైతన్యం పెరుగుతున్న దశలో పాలకులు, పోలీసు యంత్రాంగం విపరీతమైన అణచివేతకు పాల్పడింది. మనసున్న ఏ మని షి అయినా పాలమూరు సమస్యలకు కదిలిపోతా రు. నారాయణపేటలో మేం ఒక ధర్నా కార్యక్షికమం నిర్వహిస్తే అక్కడ పనిచేస్తున్న ఆర్డీవో (నా విద్యార్థి) మాతో పాటు టెంటులో కూర్చుంది. వృత్తిపరమైన సమస్యలుంటాయి అని నేనంటే, పాలమూరు సమస్యలను చూసిన ఎవ్వరైనా ఇలా కూర్చోవలసిందే అన్నది. ఈ నెల 15,16 తేదీలలో పాలమూరు ప్రజల ఉద్యమాల కొనసాగింపుగా, పాలమూరు అధ్యయన వేదిక 30 గంటల పాలమూరు జల సాధన దీక్ష శిబిరా న్ని నిర్వహిస్తున్నది. దీనిలో ప్రముఖులు, పాలమూరు అవస్థను చూసిన చుక్కా రామయ్య, రాంచంవూదమూర్తి, పొత్తూరి వెంక లాంటి వాళ్లే కాక, కవు లు, కళాకారులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తు న్న కోదండరాం వస్తారు. పాలమూరు నీటి సమస్య తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన అంశంగా మారాలి. మరోసారి చెప్పాలంటే కరువు కాటకాలున్న ప్రాంతానికి ప్రజా చైతన్యమే పరిష్కార మార్గం. పాలమూరు భవిష్యత్ స్వప్నాన్ని నీళ్లు పోసి పెంచేలా అందరం కృషి చేద్దాం.

No comments:

Post a Comment